Kushi Movie

ఏ మేరా జహా… అంటూ పూర్తి హిందీ పాటతో జాతీయ సమైక్యతా భావాన్ని యువతకు పరిచయం చేసిన రోజులవి.. శత్రువునైనా ప్రేమతో గెలవొచ్చు అని గుర్తు చేసిన సమయమది.. ప్రేమంటే తాకకుండా మనసులోని భావాలకు స్వేచ్ఛనిచ్చి, గౌరవించి గెలుచుకోవచ్చనే ట్రెండ్ ను యువతకు చేరువ చేసిన వెండితెర వెలుగుల నిధి.

బయ్ బయ్యే బంగారి రమణమ్మ అనే జానపద పాటను హీరో లయబద్ధంగా పాడుతూ శ్రీకాకుళం యాసలోని మాధుర్యాన్ని, సాహిత్యాన్ని ప్రపంచానికి దగ్గర చేసిన ప్రయత్నమది…

ఇద్దరు మిత్రుల సున్నిత హాస్యం, పెద్దల పట్ల మర్యాద, అమ్మంటే అమితమైన ఇష్టం, నాన్నంటే అంతులేని గౌరవాన్ని సున్నితంగా చూడచక్కగా ఆవిష్కరించిన అందాల దృశ్యకావ్యం ఖుషి చిత్రం…

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఖుషి సినిమా విడుదలైన రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు, రీరిలీజ్ ద్వారా ప్రపంచంలోని అభిమానులకు కనువిందు చేసేందుకు, 2022వ సంవత్సరాన్ని సంబరంగా ముగించేందుకు, కొత్త సంవత్సరాన్ని మరింత శోభాయమానంగా పరిచయం చేసేందుకు ముందుకొస్తోంది.

పవన్ కళ్యాణ్, భూమిక ప్రధాన తారాగణంగా 2001వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఖుషి సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్.. ఓ సినీ మ్యాజిక్.

మొదటి షాట్ నుంచి చివరి వరకు కేవలం పవన్ కళ్యాణ్ గారి మేనియాతో నడిచే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం యువతను, కుటుంబ ప్రేక్షకులను కట్టి పడేశాయి.

అప్పట్లో హీరోగా పవన్ కళ్యాణ్ ఖుషిలో చూపిన స్టైల్, ఆటిట్యూట్ యువతకు మరపురాని సంతోషాల మూటలు. ఏ కళాశాలలో చూసినా.. ఏ పది మంది యువ బ్యాచ్ మాట్లాడుకున్నా ఖుషి సినిమా మాటలు.. నడవడిక లేకుండా ఉండేవి కావంటే ఖుషి మేనియా అప్పట్లో ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రతి సీన్, డైలాగ్, ముఖ కదలిక, ఎక్సప్రషన్ తో పాటు సిద్ధార్థ్ రాయ్ గా పవన్ కళ్యాణ్ వేసుకొన్న డ్రెస్, హెయిర్ స్టయిల్ ను అప్పటి యువతరం కాపీ చేసి క్రేజ్ ను ఫాలో అయ్యేది.

ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కళాశాలకు వేసుకొని వెళ్లే పుస్తకాల బ్యాగు, GAP లోగోతో వచ్చే టీ షర్టులు ఎక్కడున్నా హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి.

ఆ నాటి ఖుషి విడుదల రోజులు థియేటర్ల వద్ద జాతరను తలపించేవి.. ఏకధాటిగా రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన అలనాటి వినోదాల ఖుషి రీరిలిజ్ లో భాగంగా డిసెంబరు 31న మళ్లీ ఆనందాల జల్లులతో తడిపేయడానికి, కొత్త సంవత్సరానికి సంతోషాల వెలుగులతో స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతోంది.

సినిమా విడుదలై రెండు దశాబ్దాలు దాటినా జోరు తగ్గని విధంగా మళ్లీ రికార్డుల వేటకు ముందుకొస్తోంది…

హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ నాక్స్ లో ఓ రీరిలీజ్ సినిమా వరుసగా 14 షోలు పడటం పెద్ద రికార్డు అయితే… హైదరాబాద్ నగరం పరిధిలో ఉన్న థియేటర్లలోనే ఏకంగా 190 షోలు రీరిలీజ్ సినిమా ఒకేరోజు పడుతుండటం మరో ఎత్తు.

నైజాంలో ఏకంగా 200కు పైగా థియేటర్లలో సినిమా విడుదల కావడం భారీ రికార్డుగానే చెప్పొచ్చు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో 7 థియేటర్లలో రీరిలీజ్ సినిమా విడుదల కావడం ఇదే మొదటి సారి. గోదావరి జిల్లాల్లోనూ దాదాపు 70 థియేటర్లు ఖుషి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సీడెడ్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులోనూ భారీ విడుదలకు ఖుషి సిద్ధం కావడం కనిపిస్తోంది.

ఇక విదేశాల్లోనూ ఖుషి రీరిలీజ్ రికార్డులకు అంతే లేదు. ఏకంగా అక్కడ సుమారు 500 స్క్రీన్లు సిద్ధం అవుతున్నట్లు ప్రాథమిక అంచనా. అభిమానులు ఎక్కడికక్కడ ప్రత్యేక ప్రదర్శనలు వేసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ షోలు, థియేటర్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది.